వ్యాసపూర్ణిమ సందర్భంగా మద్నూరు గురుకులంలో ఘనంగా కార్యక్రమం
వేదవ్యాసుని జీవితం, సాహిత్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించిన డా. బి. వెంకట్.
సంస్కృత శ్లోకాలు, ప్రతిజ్ఞతో ఆకట్టుకున్న కార్యక్రమం
మద్నూరు, జూలై 29: E6 tv NEWS (M. మస్నాజీ)
సంస్కృత సాహిత్యానికి, అనంతమైన వైదిక వాఙ్మయానికి మూలపురుషుడు మహర్షి వేదవ్యాసుడేనని సంస్కృతభాషా ప్రచార సమితి నిజామాబాద్–ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ పద్యకవి డా. బి. వెంకట్ పేర్కొన్నారు.సంస్కృతభాషా ప్రచార సమితి, సంస్కృతభాషా పరిరక్షణ సమితి, సంస్కృత అధ్యాపక సంఘం ఆధ్వర్యంలో మద్నూరు తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం, జూనియర్ కళాశాలలో వ్యాసపూర్ణిమ–గురుపూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదవ్యాస మహర్షిని సంస్కృత శ్లోకాలతో స్తుతించి, సరస్వతీదేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సంస్కృతభాషా ప్రచార సమితి, సంస్కృతభాషా పరిరక్షణ సమితి, సంస్కృత అధ్యాపక సంఘం ఆధ్వర్యంలో మద్నూరు తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం, జూనియర్ కళాశాలలో వ్యాసపూర్ణిమ–గురుపూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదవ్యాస మహర్షిని సంస్కృత శ్లోకాలతో స్తుతించి, సరస్వతీదేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం జరిగిన సభలో డా. బి. వెంకట్ మాట్లాడుతూ చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, మహాభారతం, శ్రీమద్భగవద్గీత వంటి సనాతన ధార్మిక విజ్ఞాన సంపదను ప్రపంచానికి అందించిన మహనీయుడు వేదవ్యాసుడని పేర్కొన్నారు. ఆషాఢ పౌర్ణమి రోజున సత్యవతి–పరాశర మహర్షి దంపతులకు జన్మించిన ఆయన జయంతిని వ్యాసపూర్ణిమ, గురుపూర్ణిమ, ఆషాఢ పౌర్ణిమ పేర్లతో జరుపుకుంటారని తెలిపారు. గురువులకు గురువుగా కీర్తించబడిన వేదవ్యాసుడు వైదిక వాఙ్మయానికి ఎనలేని సేవ చేశారని, ఆయన జీవన స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రిన్సిపాల్ ఏ. సుధాకర్ మాట్లాడుతూ మహర్షుల చరిత్రలను విద్యార్థులు అధ్యయనం చేసి వారి ఆదర్శాలను జీవితంలో ఆచరించాలని సూచించారు.
ఈ సందర్భంగా డా. బి. వెంకట్ పఠించిన వేదమంత్రాలు, సంస్కృత ప్రతిజ్ఞ, సుభాషితాలు, శ్లోకాలు విద్యార్థులు, ఉపాధ్యాయులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఏ. సుధాకర్, ఉపాధ్యాయులు బి. సుమన్, జే. గణేశ్, జి. రాము, ఎస్. నరహరి, ఎస్. ప్రవీణ్, గంగాప్రసాద్, సంజు, దత్తు, నాగయ్య, శంకర్, పండరి, హన్మాండ్లు తదితరులు, 601 మంది విద్యార్థులు పాల్గొన్నారు.



