అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
– TGVP బోధన్ డివిజన్ అధ్యక్షుడు మీసాలే నాగేష్
బోధన్, నవంబర్ 13:(E6tv NEWS).
పదో తరగతి పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ ప్రైవేట్ పాఠశాలలు దోపిడీకి పాల్పడుతున్నాయని, అటువంటి పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (TGVP) బోధన్ డివిజన్ అధ్యక్షుడు మీసాలే నాగేష్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదో తరగతి పరీక్ష ఫీజు రూ.125 మాత్రమే ఉండగా, కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థుల నుంచి రూ.1,000 నుంచి రూ.2,000 వరకు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ విధంగా అదనపు ఫీజులు వసూలు చేయడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్ణీత పరీక్ష ఫీజుకు మించి వసూలు చేసిన మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తిరిగి చెల్లించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఈ సమస్యను జిల్లా విద్యాశాఖ అధికారి (DEO), జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
విద్యార్థుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ నిరంతరం పోరాడుతుందని, విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరిగినా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో TGVP డివిజన్ కార్యదర్శి నిఖిల్‌తో పాటు పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
