ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నిష్పాక్షికత లోపించిందని, ఈసీ తీరుపై ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 28న (సోమవారం) తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం సమీపంలో సోమవారం ఉదయం 10:30 గంటలకు భారీ ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్‌ఐఆర్ విధానంలో తలెత్తుతున్న అనుమానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగిస్తున్నాయని, దీనిపై ఈసీ స్పష్టమైన వివరణ ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేపడుతున్న ఈ ఆందోళనా కార్యక్రమాలకు ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

