ఆధ్యాత్మికతకు ఆధునిక సంగీతాన్ని జోడించి భక్తి సమ్మేళనాన్ని సరికొత్తగా అందించే వినూత్న ప్రక్రియే ‘భజన్ క్లబ్బింగ్’ (Bhajan Clubbing). సంప్రదాయ భజనల పవిత్రతను కాపాడుతూనే, వాటికి మోడ్రన్ మ్యూజిక్, బీట్స్, కచేరీ తరహా లైవ్ వాతావరణాన్ని జోడించడమే దీని ప్రత్యేకత. ఇక్కడ ప్రేక్షకులు కేవలం వినడమే కాకుండా చప్పట్లు కొడుతూ, నృత్యం చేస్తూ ఉత్సాహంగా భాగస్వాములవుతారు. ఈ కొత్త ట్రెండ్ ప్రస్తుతం Gen-Z యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది.
పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పార్క్‌లో నిర్వహించిన ‘భజన్ క్లబ్బింగ్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొన్నారు. సామాన్య ప్రేక్షకుల మధ్య కూర్చున్న ప్రధాని, చేతిలో కంజర (చిన్న వాయిద్యం) వాయిస్తూ, తాళానికి అనుగుణంగా చప్పట్లు కొడుతూ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ ఏడాది జనవరిలోనే ‘మన్ కీ బాత్’లో ఈ విధానం గురించి ప్రస్తావించిన ప్రధాని, సాంప్రదాయ ఆధ్యాత్మికతను ఆధునికతతో మిళితం చేస్తూ యువతను భక్తి మార్గం వైపు నడిపించే మంచి ప్రయత్నంగా భజన్ క్లబ్బింగ్‌ను కొనియాడారు.

