సీసీ కెమెరాల ఫుటేజీ ఇవ్వకపోవడంపై మరోసారి విచారణకు ఆదేశాలు
నాలుగు రోజుల్లో సమాచారం ఇస్తామన్న ఎస్ఐ హామీ అమలు కాలేదని బాధితుడి ఆరోపణ
ధర్మపురి, నవంబర్ 16: (E6tv NEWS).
బుగ్గారం పోలీస్ స్టేషన్‌లో జరిగినట్లు ఆరోపిస్తున్న దాడికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీని సమాచార హక్కు చట్టం కింద కోరినా అందించకపోవడంపై తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ మరోసారి స్పందించింది. ఈ వ్యవహారంపై రెండోసారి విచారణకు ఆదేశిస్తూ సంబంధిత పోలీస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది.సీనియర్ ఉద్యమకారుడు చుక్క గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. 2022 మే 1న బుగ్గారం పోలీస్ స్టేషన్‌లో కొందరు వ్యక్తులు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై తన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ గుడికందుల సందీప్ ఐదుగురిపై కేసు నమోదు చేశారు. అయితే ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీని అందించాలని అదే రోజు సమాచార హక్కు చట్టం కింద పోలీసులకు దరఖాస్తు చేసినప్పటికీ సమాచారం అందలేదని తెలిపారు.
చట్టబద్ధమైన గడువు ముగిసినా ఫుటేజీ ఇవ్వకపోవడంతో అప్పటి ధర్మపురి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు మొదటి అప్పీలు చేసినట్లు పేర్కొన్నారు. అక్కడ కూడా సమాచారం అందకపోవడంతో తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించినట్లు వెల్లడించారు.గత విచారణలో కమిషన్ ఎదుట హాజరైన ఎస్ఐ గోంగాటి సతీష్ నాలుగు రోజుల్లోగా సీసీటీవీ ఫుటేజీని అందజేస్తానని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని గంగారెడ్డి తెలిపారు. దీంతో ఈ నెల 17న ఉదయం 11 గంటలకు అవసరమైన సమాచారంతో విచారణకు హాజరుకావాలని పోలీస్ అధికారులకు కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
ముగ్గురు ఎస్ఐల పాత్రపై బాధితుడి ప్రశ్నలు
ఈ వ్యవహారంలో అప్పటి ఎస్ఐ గుడికందుల సందీప్, ఆయన స్థానంలో పనిచేసిన ఎస్ఐ తీగల అశోక్, ప్రస్తుత విచారణలో కమిషన్ ఎదుట హాజరైన ఎస్ఐ గోంగాటి సతీష్ పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. ఫుటేజీ అందించకుండానే మొదటి ఎస్ఐ బదిలీపై వెళ్లిపోయారని గంగారెడ్డి ఆరోపించారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ తీగల అశోక్ నిందితులతో కుమ్మక్కై కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.ఎస్ఐ గోంగాటి సతీష్ కమిషన్ ఎదుట ఫుటేజీ అందజేస్తానని హామీ ఇచ్చినా అమలు చేయలేదని విమర్శించారు. ఈ ముగ్గురు అధికారుల్లో ఎవరి బాధ్యత ఎంత అనే అంశంపై సమాచార కమిషన్ విచారణలో స్పష్టత వస్తుందని బాధితుడు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సమాచార హక్కు చట్టం కింద కోరిన సీసీ కెమెరాల ఫుటేజీ బాధితుడికి అందుతుందా? ఈ వ్యవహారంలో కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 17న జరగనున్న విచారణపై ఆసక్తి నెలకొంది.
