Breaking News

పేదల ముఖాల్లో చిరునవ్వులే లక్ష్యం.. అర్హులందరికీ సంక్షేమ పథకాలే అండ

పింఛన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి

బాన్సువాడ, నవంబర్ 16: (E6tv NEWS).

పేదల జీవితాల్లో వెలుగులు నింపడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సోమవారం బాన్సువాడ పట్టణంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ పట్టణ ఆర్డీఓ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పింఛన్ అనేది కేవలం నెలవారీ ఆర్థిక సహాయం మాత్రమే కాదని, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు ప్రభుత్వం అందిస్తున్న భరోసా అని పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.ప్రజల అవసరాలను గుర్తించి, వారి కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అధికారం అనేది ప్రజలకు సేవ చేయడానికి లభించిన బాధ్యత అని, పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడమే తన రాజకీయ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

దివ్యాంగులకు ఆధునిక సహాయక పరికరాలు

నియోజకవర్గంలో అంగవైకల్యం ఎవరి జీవితానికీ అడ్డంకి కాకూడదనే మానవతా దృక్పథంతో ప్రత్యేక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సహాయక పరికరాలు పొందలేని దివ్యాంగులకు తన చిన్న కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి సొంత నిధులతో లండన్ (యూకే)లో తయారైన ఆధునిక కృత్రిమ అవయవాలు, సహాయక పరికరాలను అందిస్తున్నట్లు వెల్లడించారు.

నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి అర్హులైన వారికి ఈ పరికరాలను పంపిణీ చేస్తామని, క్యాంపుల తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.ఈ సేవా కార్యక్రమం రాజకీయాల కోసం, ఓట్ల కోసం కాదని, కేవలం మానవతా బాధ్యతతో చేపడుతున్న కార్యక్రమమని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ, గ్రామీణ మండలం, బీర్కూర్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *