Breaking News

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందేలా కృషి చేస్తా

అసెంబ్లీలో పెన్షన్లపై మాట్లాడిన ఏకైక వ్యక్తిని నేనే.. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

ఆర్మూర్, నవంబర్ 16: (E6tv NEWS).

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సోమవారం డొంకేశ్వర్, నందిపేట్ మండల కేంద్రాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన పెన్షన్లపై లబ్ధిదారులతో మాట్లాడి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అసెంబ్లీ గేటు కూడా తాకని వ్యక్తులు ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అయినా పెన్షన్ల అంశంపై మాట్లాడితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో తెలంగాణ ప్రజల తరఫున పెన్షన్ల అంశాన్ని ప్రస్తావించిన ఏకైక వ్యక్తిని తానేనని పేర్కొన్నారు.ఎన్నో ఏళ్లుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న మహిళల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందమే తనకు నిజమైన సంతృప్తినిస్తోందని అన్నారు. పెన్షన్లు అందని అర్హులైన వారికి కూడా త్వరలో మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

గ్రామాల్లో సర్పంచులు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.యువత భవిష్యత్తును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, గ్రామాల్లో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు సమాజమంతా కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *