Breaking News

జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.

ఇండ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు, రక్షణ చట్టం అమలు చేయాలని టిడబ్ల్యూజేఎఫ్ డిమాండ్

నిజామాబాద్, జూలై 13: E6 న్యూస్ శివ ఠాకూర్.
జిల్లా, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించడంతో పాటు అక్రిడిటేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన చేపట్టి, అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ భుజంగరావుకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండనక, వాననక ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు కనీస భద్రతా హామీలు కూడా లేవని పేర్కొన్నారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని, వృత్తి నిర్వహణలో భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని, అక్రిడిటేషన్ కమిటీల్లో అన్ని జర్నలిస్టు సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందించి, కంట్రిబ్యూషన్‌ను ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు జిల్లా, మండల కేంద్రాల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని, అలాగే జర్నలిస్టుల రైల్వే పాస్‌ల పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, జిల్లా కార్యదర్శి రాంచందర్, జిల్లా నాయకులు మధు, అనిత, ప్రవీణ్, అఖిల్, రాజు, కృష్ణ, రాజేందర్, శ్రీకాంత్ గౌడ్, సురేష్, లక్ష్మణ్, ఆనంద్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *