Breaking News

ప్రభుత్వ భూమి కబ్జాయత్నంపై గ్రామస్తుల ఆందోళన, పోతంగల్ హంగర్గా ఫారంలో ఉద్రిక్తత.

  • గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిని కాపాడుతామని గ్రామస్తుల స్పష్టం
  • గైక్వాడ్ భీమ్రావుపై గ్రామస్తుల ఆరోపణలు
  • ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన పోలీసులు

పొతంగల్, జూలై 2:(E6 న్యూస్: ఔరాద్ అశోక్)

నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలంలోని హంగార్గా ఫారం గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణ యత్నం జరిగిందంటూ గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు ఏకమై నిలిచామని గ్రామస్తులు తెలిపారు.

గ్రామస్తుల కథనం ప్రకారం, గైక్వాడ్ భీమ్రావు అనే వ్యక్తి తన వ్యవసాయ భూమికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ట్రాక్టర్‌తో దున్నించి ఆక్రమించుకునే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ట్రాక్టర్‌ను నిలిపివేసి నిరసన తెలిపారు.

ఆ భూమిలో గ్రామానికి తాగునీరు అందించే ప్రభుత్వ బోర్లు ఉన్నాయని, గ్రామ యువత క్రీడలు నిర్వహించే స్థలం కూడా అదేనని గ్రామస్తులు పేర్కొన్నారు. అలాంటి ప్రభుత్వ స్థలాన్ని వ్యక్తిగతంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం సమంజసం కాదని వారు అన్నారు.

ఈ సందర్భంగా గైక్వాడ్ భీమ్రావు తమపై వివిధ కేసులు, ముఖ్యంగా అట్రాసిటీ కేసులు పెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. అయితే చట్టాన్ని గౌరవిస్తూ చట్టపరంగానే పోరాడతామని, ఎలాంటి బెదిరింపులకు భయపడబోమని స్పష్టం చేశారు.

అలాగే తమపై తప్పుడు కేసులు నమోదు చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ భూమిని కాపాడుకునేందుకు అవసరమైతే ఉద్యమాలు కూడా చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఇరు వర్గాల నుంచి వివరాలు సేకరించినట్లు తెలిసింది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *