ముధోల్, జూలై 23: E6 tv NEWS (తిరుపతి గౌడ్)
నీట్ పరీక్ష అంశంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోతన్న యాదవ్ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని, విద్యార్థుల తరఫున గొంతెత్తిన ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల గొంతును అణచివేసే ప్రయత్నాలను విరమించుకుని, విద్యార్థుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్న ఆయన, దేశ చరిత్రలో ఇలాంటి ఘటనలు అరుదుగా జరిగాయని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా ప్రభుత్వం మొండి వైఖరిని వీడి, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.
లేనిపక్షంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండగా నిలిచి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలను కొనసాగిస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అఫ్రోజ్ ఖాన్, సయ్యద్ ఖలీద్, శ్రీనివాస్ గౌడ్, సంజు తదితరులు పాల్గొన్నారు.

