మహిళ కడుపులో 14 సెంటీమీటర్ల రెండు గడ్డల తొలగింపు
భీంగల్ శివసాయి ఆస్పత్రి వైద్యుల ఘనత
తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం.. ఆస్పత్రి యాజమాన్యానికి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు
భీంగల్ జూలై 9: E6 న్యూస్ హెల్త్ :శివ ఠాకూర్
గ్రామీణ ప్రాంతంలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి భీంగల్ మండల కేంద్రంలోని శివసాయి ఆస్పత్రి వైద్యులు తమ వైద్య నైపుణ్యాన్ని చాటారు. సిరికొండకు చెందిన 40 ఏళ్ల మహిళ కడుపులో భారీ పరిమాణంలో రెండు గడ్డలను గుర్తించిన వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించారు.
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళ శివసాయి ఆస్పత్రిని సంప్రదించగా వైద్యులు అవసరమైన పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో ఆమె కడుపులో సుమారు 14 సెంటీమీటర్ల పరిమాణం కలిగిన రెండు గడ్డలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు.
డాక్టర్ గల్లా సూర్యనార్య, డాక్టర్ హరినారాయణ, డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలోని వైద్య బృందం శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి మహిళ కడుపులోని రెండు భారీ గడ్డలను తొలగించింది. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆరోగ్యం మెరుగుపడటంతో త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.
సాధారణంగా అధిక వ్యయంతో కూడుకున్న ఇటువంటి క్లిష్టమైన శస్త్రచికిత్సను గ్రామీణ ప్రాంతమైన భీంగల్‌లోనే తక్కువ ఖర్చుతో నిర్వహించి నాణ్యమైన వైద్య సేవలు అందించడం పట్ల రోగి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
తమ కుటుంబ సభ్యురాలికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం అందించిన వైద్యులు డాక్టర్ గల్లా సూర్యనార్య, డాక్టర్ హరినారాయణ, డాక్టర్ అనిల్ కుమార్‌తో పాటు శివసాయి ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ పొదేండ్ల సాయికుమార్, ఆస్పత్రి సిబ్బందికి రోగి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

