Breaking News

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన

నిజామాబాద్, జూలై 2: E6 న్యూస్ శివ ఠాకూర్

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. జిల్లా శిక్షణ మరియు ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో, TOMCOM సౌజన్యంతో గురువారం నిజామాబాద్ నగరంలోని వర్ని చౌరస్తా జనార్దన్ గార్డెన్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఆయన నగర మేయర్ ఉమారాణితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. తర్వాత వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి ప్రతినిధులతో మాట్లాడి ఉద్యోగ అవకాశాలపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో దేశీయ, విదేశీ సంస్థల ద్వారా ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాల విషయంలో యువత భయపడాల్సిన అవసరం లేదని, ఎన్‌ఆర్‌ఐల సంక్షేమంతో పాటు గల్ఫ్ కార్మికుల కోసం కొత్త పాలసీ తీసుకురానున్నట్లు చెప్పారు.

నిజామాబాద్‌లో ఇంత పెద్ద స్థాయిలో జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్న ఎమ్మెల్యే, నిర్వాహకులను అభినందించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శిక్షణ మరియు ఉపాధి శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ (ఐఏఎస్), జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి వేల్పుల విజేత, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మునిపల్లి సాయరెడ్డి, అమృతాపూర్ గంగాధర్, పొలసాని శ్రీనివాస్, ఉమ్మాజీ నరేష్, అంబర్ సింగ్, గాదె నరేష్, గోవర్ధన్ రెడ్డి, చింతల కిషన్, కో-ఆప్షన్ సభ్యుడు అశోక్, వివిధ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *