Breaking News

వికలాంగుల పెన్షన్ పెంపు కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమం.

జూలై 28–30 తేదీల్లో బోధన్‌లో వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాలపై రాష్ట్ర సదస్సు

33 జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య వెల్లడి

బోధన్, జూలై 6: E6 న్యూస్(ఔరాద్ అశోక్).

వికలాంగుల పెన్షన్ పెంపు, హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల సమర్థ అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య తెలిపారు.

బోధన్ పట్టణంలో నిర్వహించిన నిజామాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వికలాంగుల పట్ల సమాజంలో ఇప్పటికీ వివక్ష, నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి వికలాంగుల హక్కుల ఒప్పందం ప్రకారం విద్య, ఉపాధి, గృహవసతి, సామాజిక భద్రత వంటి అంశాల్లో వికలాంగులకు సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు.

ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో వికలాంగులకు ఉద్యోగావకాశాలు కల్పించే చట్టాలు ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని సమర్థవంతంగా అమలు చేయడం లేదని విమర్శించారు. మెంటల్ హెల్త్ కేర్ చట్టం అమలులోకి వచ్చినప్పటికీ మానసిక వికలాంగుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు.

2016 వికలాంగుల హక్కుల చట్టం (RPWD Act) ప్రకారం నియమించాల్సిన చీఫ్ కమిషనర్, నేషనల్ ట్రస్ట్ చైర్మన్ నియామకాలను కేంద్ర ప్రభుత్వం ఇంకా పూర్తి చేయకపోవడం దురదృష్టకరమన్నారు. వికలాంగుల విద్య, నైపుణ్యాభివృద్ధికి ఏర్పాటు చేసిన జాతీయ సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణలో గుర్తించిన 1,572 స్పెషల్ టీచర్ పోస్టుల్లో కేవలం 750 మాత్రమే భర్తీ చేశారని, మిగిలిన పోస్టులకు వెంటనే ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రత్యేక పాఠశాలలు, ఉమ్మడి జిల్లా స్థాయిలో జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ప్రతి జిల్లాలో వికలాంగుల కోసం ప్రత్యేక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు.

వికలాంగుల విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్‌లు, మెస్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలని, నైబర్‌హుడ్ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్ర సదస్సు బోధన్‌లో….

వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాలపై జూలై 28, 29, 30 తేదీల్లో బోధన్ పట్టణంలోని అప్నా గార్డెన్‌లో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు అడివయ్య తెలిపారు. ఈ సదస్సుకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరవుతారని, వికలాంగుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. సదస్సు విజయవంతానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. బస్వరాజు పాటిల్, జిల్లా అధ్యక్షులు గైని రాములు, జిల్లా కార్యదర్శి యేశాల గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ నజీర్, జిల్లా సహాయ కార్యదర్శి దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *