ఎన్ఎమ్‌సీ నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లకు అధికారిక అనుమతి
నిజామాబాద్, జూలై 13: E6 న్యూస్ శివ ఠాకూర్
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు మరో శుభవార్త లభించింది. కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను 120 నుంచి 150కు పెంచేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎమ్‌సీ) అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కళాశాలలో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
అదనంగా 30 ఎంబీబీఎస్ సీట్ల మంజూరు కోసం ఈ ఏడాది జూన్ 17న ఎన్ఎమ్‌సీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు నియమించిన నలుగురు అసెస్సర్ల బృందం నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రత్యక్ష తనిఖీలు నిర్వహించింది. మౌలిక వసతులు, అధ్యాపకుల సంఖ్య, వైద్య సేవలు, విద్యా ప్రమాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ తనిఖీ నివేదిక ఆధారంగా జూలై 13న ఎన్ఎమ్‌సీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు పూర్వం ఉన్న 120 సీట్లకు అదనంగా 30 సీట్లు కలుపుతూ మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లకు అధికారిక అనుమతి పత్రం (Letter of Permission) జారీ చేసింది.

