ప్రభుత్వ స్థలంలో మహిళా భవనం ఏర్పాటు చేయాలని స్థానిక మహిళల డిమాండ్
నిజామాబాద్, జూలై 2: E6 న్యూస్ (శివ ఠాకూర్):
నగరంలోని 35వ డివిజన్లో ప్రభుత్వ రోడ్డు కబ్జాకు సంబంధించిన అంశంపై అధికారులు ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం స్థానికుల్లో అసంతృప్తికి దారితీసింది. ప్రభుత్వ రోడ్డు ఆక్రమణపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత శాఖలు స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాన్ని సంబంధిత ప్రైవేట్ పాఠశాల క్రీడా ప్రాంగణంగా ఎలా వినియోగిస్తారనే ప్రశ్నను స్థానికులు లేవనెత్తుతున్నారు. ప్రభుత్వ ఆస్తిని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధమని, దీనిపై అధికారులు వెంటనే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ప్రభుత్వ స్థలం కావడంతో అక్కడ మహిళల అవసరాల కోసం మహిళా భవనం ఏర్పాటు చేయాలని స్థానిక మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మహిళల సమావేశాలు, స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా మహిళా భవనం నిర్మించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ విషయంపై స్పందించిన 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుదీర్ మాట్లాడుతూ, త్వరలోనే నగర మేయర్‌తో పాటు కార్పొరేషన్ అధికారులను సంఘటనా స్థలానికి తీసుకువెళ్లి ప్రత్యక్షంగా పరిశీలన నిర్వహిస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా కాకుండా చూసుకోవడం తన బాధ్యత అని తెలిపారు.

