జుక్కల్ నియోజకవర్గంలోని వాడి గ్రామ ప్రజలకు రహదారి, వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్
“మమ్మల్ని ప్రతి నాయకుడు మోసం చేశాడు” అంటూ గ్రామస్తుల ఆగ్రహం
జుక్కల్: E6 tv NEWS ప్రతినిధి (వాడి):
కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గంలోని వాడి గ్రామ ప్రజల దుస్థితి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతున్నా మారలేదు. గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని, అత్యవసర పరిస్థితుల్లో వైద్యం, విద్య, ఉపాధి కోసం బయటకు వెళ్లడం కూడా కష్టంగా మారుతోందని గ్రామస్తులు చెబుతున్నారు.
గ్రామంలో అధికంగా దళిత కుటుంబాలు నివసిస్తున్నాయని, ఎన్నికల సమయంలో ప్రతి రాజకీయ నాయకుడు గ్రామానికి వచ్చి రోడ్డు, వంతెన నిర్మాణం చేస్తామని హామీలు ఇస్తున్నారని, అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరూ గ్రామం వైపు తిరిగి చూడడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.ప్రస్తుతం జుక్కల్ ఎమ్మెల్యేగా ఉన్న లక్ష్మీకాంతరావు ఎన్నికల ప్రచారం సమయంలో గ్రామాన్ని సందర్శించి, గ్రామ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసి, వంతెనతో పాటు రహదారి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో వీడియోలు కూడా చిత్రీకరించి హామీలు ఇచ్చారని, అయితే ఇప్పటి వరకు ఆ హామీలు అమలుకాలేదని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
“ప్రతి నాయకుడు మమ్మల్ని మోసం చేశాడు. ఈసారి మార్పు వస్తుందని భావించి ఓటు వేశాం. కానీ మా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు” అని గ్రామ ప్రజలు వాపోతున్నారు.
స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు గడిచినా తమ గ్రామానికి రహదారి లేకపోవడం బాధాకరమని పేర్కొంటూ, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి వాడి గ్రామానికి వంతెన, శాశ్వత రహదారి నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

