రైతాంగం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ముక్కోటి దేవతలను వేడుకున్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బాల్కొండ ఎమ్మెల్యే
భీంగల్, జూలై 13: E6 న్యూస్ తాటికొండ గంగాధర్
నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహిస్తున్న “ఊర పండుగ” మహోత్సవంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముక్కోటి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాలు, రైతాంగం సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భీంగల్ ఊర పండుగ కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చే సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రజలంతా ఐక్యంగా ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొని దేవతామూర్తులను దర్శించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు.భీంగల్ ప్రాంత ప్రజల్లో అధిక శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని గుర్తు చేసిన ఎమ్మెల్యే, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రతి రైతు కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని ముక్కోటి దేవతలను మనస్ఫూర్తిగా వేడుకున్నట్లు తెలిపారు.
భీంగల్ ప్రజలు అమాయకులు, భక్తి విశ్వాసాలు కలిగిన వారని కొనియాడిన ప్రశాంత్ రెడ్డి, ప్రజల మొక్కులను దేవతలు తప్పకుండా మన్నించి త్వరలోనే ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా మారుస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా భీంగల్ పట్టణ ప్రజలకు, వివిధ కుల సంఘాల నాయకులకు, విడీసీ (VDC) సభ్యులకు, భక్తులకు ఎమ్మెల్యే ఊర పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, విడీసీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

