సహజీవనం, బలవంతపు గర్భస్రావాలు, పెళ్లికి నిరాకరణ అంటూ ఫిర్యాదు – ఆరోపణలను రాజకీయ కుట్రగా కొట్టిపారేసిన సర్పంచ్ దస్తగిరి
బోధన్, జూలై 8: E6 న్యూస్,
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం జల్లాపల్లి ఫారం గ్రామ సర్పంచ్ దస్తగిరిపై ఓ యువతి తీవ్ర ఆరోపణలు చేసింది. దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా ప్రేమ పేరుతో తనను నమ్మించి, సర్పంచ్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి చివరకు మోసం చేశాడని బాధితురాలు సీమ ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆమె మీడియాకు తెలిపింది.
పాఠశాల దశలో మొదలైన పరిచయం
పాఠశాలలో చదువుతున్న రోజుల నుంచే దస్తగిరి తనను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడని, ఆ పరిచయం ప్రేమగా మారిందని సీమ తెలిపింది. అనంతరం తనకు జరిగిన రెండు వివాహాలు కూడా దస్తగిరి ప్రేరేపణతో విడాకుల వరకు వెళ్లాయని ఆరోపించింది. చివరికి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి బోధన్‌లో పలువురు సంవత్సరాలు సహజీవనం చేశాడని పేర్కొంది.
గర్భస్రావాలు చేయించాడని ఆరోపణ
సహజీవనం సమయంలో రెండుసార్లు గర్భం దాల్చగా టాబ్లెట్లు ఇచ్చి గర్భస్రావం చేయించాడని సీమ ఆరోపించింది. అనంతరం తనకు తెలియకుండా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గర్భసంచి తొలగించే శస్త్రచికిత్స చేయించారని కూడా ఆరోపించింది. ఈ వ్యవహారంలో ఓ స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడు కూడా సహకరించాడని ఆమె పేర్కొంది.

