28వ డివిజన్‌లో ప్రత్యేక పరిశీలన.. ఓటర్లందరూ ఎస్ఐఆర్‌లో భాగస్వాములు కావాలని పిలుపు
ఇందూరు, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్
నగరంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను మరింత వేగవంతం చేసి, ప్రతి అర్హ ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అధికారులకు సూచించారు.
బుధవారం నగరంలోని 28వ డివిజన్‌లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఎమ్మెల్యే ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హ పౌరుడు ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో తప్పనిసరిగా భాగస్వామి కావాలని కోరారు.ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్లకు (బీఎల్‌ఓలు) అందజేయాలని సూచించారు. ఫారాలు నింపడంలో కొంతమంది ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బీఎల్‌ఓలు, రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) సమన్వయంతో పనిచేసి ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు.
అలాగే, కార్పొరేటర్లు తమ పరిధిలోని ప్రతి ఓటరికి అవగాహన కల్పిస్తూ, ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తి చేసి నిర్ణీత సమయంలో తిరిగి అందించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మల్కాయి మహేందర్, నాగోల్ల లక్ష్మీనారాయణ, జ్యోతి మురళి, నాయకులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును జూలై 24 నుంచి ఆగస్టు 3 వరకు పొడిగించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రతి అర్హ ఓటరు వినియోగించుకుని, గడువు ముగిసేలోపు తమ ఎన్యుమరేషన్ పత్రాలను సంబంధిత బీఎల్‌ఓలకు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.

