ఒక నెల మందులు ఇవ్వగా 22 రోజుల పాటు వాడినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ
తప్పు జరిగిందని వైద్య సిబ్బంది క్షమాపణ చెప్పారని సీతారాం వాదన
తల్లి, శిశువుకు ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరు? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కుటుంబ సభ్యులు
సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి




రుద్రూర్ జులై 19: E6tv NEWS (అశోక్ కాంబ్లే).
నిజామాబాద్ జిల్లా రుద్రూరు ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీకి కాలం చెల్లిన మందులు ఇచ్చారంటూ కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది.
బాధితురాలి మామ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం, తన కోడలు ప్రస్తుతం గర్భధారణ చివరి దశలో ఉందని, ఇంతకాలం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చినప్పటికీ, ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతాయని వైద్య సిబ్బంది సూచించడంతో రుద్రూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు.అక్కడ వైద్య పరీక్షల అనంతరం నెల రోజుల మందులు అందించారని, వాటిని తన కోడలు 22 రోజుల పాటు వాడిన తర్వాత మందులపై ఉన్న గడువు తేదీ (ఎక్స్పైరీ) పరిశీలించగా కాలం చెల్లినవిగా గుర్తించామని ఆరోపించారు. ఈ విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా, తప్పు జరిగిందని అంగీకరించి క్షమాపణ కోరినట్లు సీతారాం తెలిపారు.
ఈ సంఘటనతో తమ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైందని, పుట్టబోయే శిశువుకు లేదా గర్భిణికి భవిష్యత్తులో ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే అందుకు బాధ్యులు ఎవరో ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.అంతేకాకుండా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇతర గర్భిణీలకు కూడా ఇలాంటి మందులు అందించారా అనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం దెబ్బతినకుండా ఉండాలంటే నిర్లక్ష్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటన అనంతరం వైద్యులు తమను బాన్సువాడ ఆస్పత్రికి పంపించి పరీక్షలు నిర్వహించారని, ప్రస్తుతం తల్లి, గర్భంలోని శిశువు ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని వైద్యులు చెప్పినప్పటికీ తమ అనుమానాలు పూర్తిగా తొలగలేదని సీతారాం పేర్కొన్నారు. ఇతర నిపుణుల వద్ద కూడా వైద్య పరీక్షలు చేయించుకుని, ఏవైనా లోపాలు బయటపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

