రాబోయే పండుగలకు పటిష్ట బందోబస్తు
పాత నేరస్థులు, రౌడీషీటర్లపై నిఘా పెంచాలి
చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర దాడులు
అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలి
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి
పోలీస్ అధికారులకు సీపీ సాయి చైతన్య ఆదేశాలు
నిజామాబాద్, జూలై 10:E6 న్యూస్ క్రైమ్: శివ ఠాకూర్
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. రాబోయే పండుగల నేపథ్యంలో బందోబస్తును మరింత పటిష్టం చేయడంతో పాటు వాహన తనిఖీలను 24 గంటలూ నిర్వహించాలని సూచించారు. తనిఖీల విషయంలో సిబ్బంది ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని స్పష్టం చేశారు.
గురువారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిజామాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పురోగతిపై సీపీ సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. హత్యలు, హత్యాయత్నాలు, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, పేకాట, గుట్కా అక్రమ వ్యాపారం తదితర కేసులపై ప్రత్యేకంగా సమీక్షించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
పాత నేరస్థులపై పటిష్ట నిఘా
రౌడీషీటర్లు, పాత నేరస్థులు, బెయిల్పై విడుదలైన వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సీపీ సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పహారా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని తెలిపారు.
మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ ప్రత్యేక బృందాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచాలని సూచించారు.
సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలి
సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీపీ తెలిపారు. ఆన్లైన్ మోసాలకు గురైన బాధితుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి సహాయం అందించాలని సూచించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అవసరమైతే పీడీ యాక్ట్
డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక దాడులను కొనసాగించాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పేకాట, గుట్కా, ఇసుకతో పాటు ఇతర అక్రమ వ్యాపారాలపై నిరంతరం దాడులు నిర్వహించాలని తెలిపారు.
పోలీస్ స్టేషన్లలో ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. రిసెప్షన్, రికార్డుల నిర్వహణ, స్టేషన్ పరిశుభ్రత, సిబ్బంది క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. సీసీ కెమెరాల వినియోగాన్ని విస్తరించి నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సీపీ అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్లను గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. హైవేలకు అనుసంధానంగా ఉన్న లింక్ రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రోడ్డు ఇంజనీరింగ్ లోపాలను గుర్తిస్తే జాతీయ, రాష్ట్ర రహదారుల అధికారులతో సమన్వయం చేసుకొని పరిష్కరించాలని సూచించారు. ప్రతి రోజు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడంపై ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని తెలిపారు. ప్రజలకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సీపీ సాయి చైతన్య స్పష్టం చేశారు.
సమావేశంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఆర్. అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సీఐలు, ఎస్హెచ్ఓలు, ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

