శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న న్యాయమూర్తులు – కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు
భీంగల్, జూలై 26: (E6 tv NEWS: T, గంగాధర్)
భీంగల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తంగిరాల మాధవి దేవి, జస్టిస్ లక్ష్మణ్ నారాయణ అలిశెట్టి, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్‌తో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి ఆలయానికి చేరుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఆలయ ప్రధాన అర్చకులు నంబి పార్థసారథి ఆలయ సంప్రదాయం ప్రకారం న్యాయమూర్తులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ చరిత్ర, ఆధ్యాత్మిక విశిష్టతను వివరించి వేదమంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం న్యాయమూర్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు.న్యాయమూర్తుల పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, భీంగల్ సీఐ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

