లారీ ఢీకొని తల్లి మృతి.. కుమారుడికి తీవ్ర గాయాలు
నిజామాబాద్, జూలై 12 (E6 క్రైమ్ న్యూస్):
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఆదివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జానకంపేట్ గ్రామ సమీపంలోని అశోక్ సాగర్ వద్ద బోధన్–నిజామాబాద్ ప్రధాన రహదారిపై లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. జానకంపేట్ గ్రామానికి చెందిన మారా కమల తన కుమారుడు అవీష్తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, బోధన్ వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కమల అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన అవీష్ను స్థానికులు వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న ఆరవ టౌన్, ఎడపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనతో జానకంపేట్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

