వర్షాభావ పరిస్థితులపై ప్రత్యేక కార్యాచరణకు మంత్రివర్గం ఆమోదం
తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై ముందస్తు చర్యలకు ఆదేశాలు
ప్రజాభవన్‌లో టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు.. రైతులకు ఆరుతడి పంటల సాగుపై సూచనలు
ధరణి అక్రమాలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు.. ట్రాన్స్‌జెండర్లకు మున్సిపల్ కార్పొరేషన్లలో కో-ఆప్టెడ్ సభ్యులుగా అవకాశం
హైదరాబాద్, జూలై 18: E6 tv News.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన 36వ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదుకాకపోవడం, చాలా ప్రాంతాల్లో కేవలం 30 నుంచి 35 శాతం వరకు మాత్రమే వర్షపాతం కురిసిన నేపథ్యంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఈ పరిస్థితులపై పూర్తి వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపి, నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపాలని కోరాలని నిర్ణయించింది. అలాగే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసింది.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్ రంగాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలను మంత్రివర్గం ఆదేశించింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ తాగునీటి సమస్యలు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించింది. విద్యుత్ కోతలు లేకుండా నిరంతర సరఫరా కొనసాగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని ముందుగా తాగునీటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయించింది.
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు సమాచారం, సూచనలు అందించేందుకు ప్రజాభవన్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే ఈ హెల్ప్‌లైన్ నంబర్ 1800-123-7157గా ప్రకటించారు. రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది.
వర్షాభావ పరిస్థితులపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నెల 20న ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల నేతృత్వంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులతో సమావేశాలు నిర్వహించి జిల్లా వారీగా పరిస్థితులపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ నిపుణులతో ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక అధ్యయన నివేదిక రూపొందించాలని కూడా సూచించింది.
ఇక ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూముల లావాదేవీలు, రికార్డుల మార్పులు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల బదలాయింపులు తదితర అంశాలపై సమగ్ర విచారణకు ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2020 అక్టోబర్ 29న ధరణి అమల్లోకి వచ్చినప్పటి నుంచి జరిగిన అన్ని అనుమానాస్పద లావాదేవీలను లోతుగా పరిశీలించాలని నిర్ణయించింది.
అదేవిధంగా రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లను కో-ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేసేందుకు తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం–2019 సవరణకు ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయతీ నిధులను జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో జమ చేసుకునేలా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లో సవరణకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
36వ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.

