నలుగురు యువకులు గల్లంతు.. ముగ్గురి మృతదేహాలు లభ్యం – మరొకరి కోసం కొనసాగుతున్న గాలింపు
సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య – వర్షాకాలంలో జలాశయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి
నిజామాబాద్, జూలై 26: E6 tv NEWS: శివ ఠాకూర్.
ముప్కాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పీ) బ్యాక్‌వాటర్ ప్రాంతంలోని లక్ష్మి కెనాల్‌లో ఆదివారం చోటుచేసుకున్న విషాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విహారయాత్రకు వెళ్లిన నలుగురు యువకులు ప్రమాదవశాత్తు వేగంగా ప్రవహిస్తున్న నీటిలో పడిపోవడంతో గల్లంతయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని బోకర్‌కు చెందిన ఆర్హాన్ (17), నిజామాబాద్ ఆటోనగర్‌కు చెందిన కలీం (24), అమ్ము అలియాస్ నజువత్ (24), అజీమ్ (24)లు కలిసి ఎస్‌ఆర్‌ఎస్‌పీ బ్యాక్‌వాటర్ ప్రాంతానికి వెళ్లారు. వరద కాలువ సమీపంలో ఉండగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయారు.సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. గల్లంతైన వారిని త్వరితగతిన గుర్తించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. నీటి ప్రవాహం అధికంగా ఉండటం, లోతు ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురైనా నిరంతరంగా గాలింపు కొనసాగించారు.గాలింపు చర్యల్లో నలుగురిలో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మరో వ్యక్తి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు ముమ్మరంగా గాలిస్తున్నారు.సంఘటన స్థలంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, ముప్కాల్ ఎస్‌ఐ సుహాసిని, ఇతర పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలను సమన్వయం చేశారు.




ఈ విషాద ఘటనపై పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం అన్ని వనరులతో గాలింపు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి
వర్షాకాలంలో ప్రాజెక్టులు, బ్యాక్‌వాటర్ ప్రాంతాలు, వరద కాలువలు, చెరువులు, నదుల వద్ద సెల్ఫీలు దిగడం, ఈత కొట్టడం లేదా నీటిలోకి వెళ్లడం అత్యంత ప్రమాదకరమని నిజామాబాద్ పోలీసులు హెచ్చరించారు. నీటి లోతు, ప్రవాహం తెలియని ప్రాంతాలకు దూరంగా ఉండి, పోలీసు మరియు సంబంధిత శాఖల సూచనలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

