ప్రధాని మోదీ నివాసం వద్ద అరాచకంగా వ్యవహరించడం ఖండనీయం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి
పార్లమెంట్‌ను పక్కనబెట్టి రాజకీయ నాటకాలకు కాంగ్రెస్ పాల్పడుతోంది
ప్రజల సానుభూతి కోసం రాహుల్ గాంధీ ప్రయత్నం
గాంధీ భవన్ ముట్టడికి వెళ్లిన బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ ఖండనీయం
అరెస్టు చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి
ఇందూరు, జూలై 22:(E6 tv NEWS శివ ఠాకూర్):ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు అరాచక మూకలను తలపించేలా ఉందని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి విమర్శించారు. ఈ ఘటనను భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.దేశ ప్రజల దృష్టిని ఆకర్షించి రాజకీయ లబ్ధి పొందడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. విద్యార్థులు గత 21 రోజులుగా శాంతియుతంగా దీక్షలు చేస్తున్నప్పటికీ పోలీసులు వారిని అడ్డుకోలేదని, అయితే పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో చట్టసభలో చర్చించాల్సిన అంశాలను పక్కనబెట్టి ప్రధాని నివాసం వద్ద ఆందోళనకు దిగడం రాజకీయ నాటకమేనని అన్నారు.
శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అరెస్టులు చేస్తే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు అక్రమ అరెస్టుల పేరుతో ఉద్యమాలు నిర్వహించడం హాస్యాస్పదమని దినేష్ పటేల్ పేర్కొన్నారు. ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన చేయవచ్చని చెప్పే వారు, బీజేపీ శ్రేణులు గాంధీ భవన్‌ను ముట్టడించకూడదని చెప్పడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా ప్రజలను, పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని రాజకీయ నాటకాలు ఆడినా ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు.
హైదరాబాద్‌లోని గాంధీ భవన్ ముట్టడికి యత్నించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని, వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన దినేష్ పటేల్ కులాచారి, అరెస్టయిన వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

