Breaking News

ప్రతి అర్హుడికి ఓటు హక్కు చేరేలా SIR పరిశీలన

అచ్చంపేట్ గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

నిజాంసాగర్, జూలై 8: E6 న్యూస్.

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి ప్రతి అర్హుడికి ఓటు హక్కు అందేలా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు.

బుధవారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి బీఎల్‌ఏలు, బీఎల్‌ఓలు నిర్వహిస్తున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ విధానాన్ని పరిశీలించడంతో పాటు ప్రజలకు స్వయంగా ఫారాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములు కావాలని సూచించారు. ఓటరు జాబితాలో సరైన వివరాల నమోదు, సవరణ ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకమని పేర్కొన్నారు.

గ్రామంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ అమలు తీరును పరిశీలించిన ఆయన, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఇంటింటికి వెళ్లి విధులు నిర్వహిస్తున్న బీఎల్‌ఏలు, బీఎల్‌ఓల సేవలను అభినందించారు.

ప్రజలందరూ ఎన్నికల అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించి అవసరమైన పత్రాలు, వివరాలను సకాలంలో అందించి ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏలే మల్లికార్జున్ కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్‌ఏలు, బీఎల్‌ఓలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *