నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ స్పోర్ట్స్:తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్‌లోని కాప్రా మల్లారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక బ్లాక్ బెల్ట్ డాన్ ప్రమోషన్ టెస్ట్‌కు నిజామాబాద్ జిల్లా నుంచి 22 మంది తైక్వాండో క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అమేచ్యూర్ తైక్వాండో అసోసియేషన్–నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, తైక్వాండో కోచ్ జె.సి. మనోజ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాకు చెందిన క్రీడాకారులు క్రమశిక్షణతో శిక్షణ పొందుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని, పరీక్షలోనూ విజయవంతంగా రాణిస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమానికి అమేచ్యూర్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నరసయ్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పదేళ్లుగా బస్వా గార్డెన్‌లో నిరంతరంగా నిర్వహిస్తున్న తైక్వాండో శిక్షణ ద్వారా వందలాది మంది విద్యార్థులు బ్లాక్ బెల్ట్‌లు సాధించారని తెలిపారు. వారిలో అనేక మంది ప్రస్తుతం ఇంజనీర్లు, ఎంబీబీఎస్ వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు తదితర ఉన్నత వృత్తుల్లో స్థిరపడి సమాజంలో విశిష్ట స్థానం సంపాదించారని పేర్కొన్నారు.
బ్లాక్ బెల్ట్ అనేది కేవలం ఒక సర్టిఫికెట్ మాత్రమే కాదని, అది క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఆత్మరక్షణ నైపుణ్యాలు మరియు ఉన్నత లక్ష్యాలను సాధించే పునాది అని ఆయన అన్నారు. విద్యార్థులు క్రీడలతో పాటు విద్యలోనూ ప్రతిభ కనబరుస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
తైక్వాండో కోచ్ జె.సి. మనోజ్ కుమార్ అందిస్తున్న సేవలను బస్వా లక్ష్మీ నరసయ్య ప్రత్యేకంగా అభినందించారు. నిజామాబాద్ జిల్లాలో తైక్వాండో అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. బస్వా గార్డెన్‌లో ప్రతిరోజూ విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందిస్తూ, వారిలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందిస్తున్నారని తెలిపారు.ఉదయం వేళల నుంచే విద్యార్థులు అంకితభావంతో శిక్షణలో పాల్గొనడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్న ఆయన, ఇలాంటి క్రీడా సేవలు సమాజ నిర్మాణానికి ఎంతో అవసరమన్నారు. భవిష్యత్తులో నిజామాబాద్ జిల్లా నుంచి మరింత మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి, దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.

