నిజామాబాద్, జగిత్యాల బ్లాక్ స్పాట్ల నివారణకు రూ.1,023 కోట్ల కేటాయింపు
లోక్‌సభలో ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం
నిజామాబాద్, జూలై 23 (E6 tv NEWS): తెలంగాణలో జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. లోక్‌సభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బ్లాక్ స్పాట్ల నివారణ చర్యలు, నిధుల కేటాయింపుల వివరాలు వెల్లడయ్యాయని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో మొత్తం 1,513 ప్రమాదకర బ్లాక్ స్పాట్లు గుర్తించగా, వాటిలో 1,308 ప్రాంతాల్లో శాశ్వత నివారణ చర్యలు పూర్తయ్యాయి. మిగిలిన 205 బ్లాక్ స్పాట్లలో పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించినట్లు ఎంపీ తెలిపారు.
నిజామాబాద్‌కు ప్రత్యేక ప్రాధాన్యం
నిజామాబాద్ జిల్లాలో గుర్తించిన 78 బ్లాక్ స్పాట్లలో 75 ప్రాంతాల్లో పనులు పూర్తయ్యాయని, మరో 3 ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయని కేంద్రం వెల్లడించింది. అలాగే జగిత్యాల జిల్లాలో 107 బ్లాక్ స్పాట్లలో 99 ప్రాంతాల్లో పనులు పూర్తి కాగా, 8 ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. ఇది నిజామాబాద్ పార్లమెంట్ ప్రజల భద్రతకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.
NH-44, NH-61, NH-63పై అభివృద్ధి పనులు
నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పరిధిలోని NH-44, NH-61, NH-63 జాతీయ రహదారులపై వంతెనలు, బైపాస్‌లు, రోడ్డు భద్రతా చర్యలతో కూడిన అభివృద్ధి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు.
రూ.1,023 కోట్లతో రోడ్డు భద్రతా ప్రాజెక్టులు
నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో జాతీయ రహదారుల అభివృద్ధి, బ్లాక్ స్పాట్ల నివారణ, వంతెనలు, బైపాస్‌లు, ఇతర రోడ్డు భద్రతా మౌలిక సదుపాయాల కోసం సుమారు రూ.1,023 కోట్లు కేటాయించినట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. ప్రజలకు సురక్షితమైన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయించేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

