Breaking News

పిల్లల మధ్య సరైన అంతరం ఉంటేనే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి

పిల్లల మధ్య సరైన అంతరం ఉంటేనే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ, సదస్సు
కుటుంబ నియంత్రణలో పురుషుల భాగస్వామ్యం పెరగాలి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు

నిజామాబాద్, జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్.
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని మాలపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అవగాహన ర్యాలీ, అనంతరం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భుజంగారావు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.మాలపల్లి పీహెచ్‌సీ నుంచి ప్రారంభమైన ర్యాలీ నగర వీధుల గుండా సాగుతూ “చిన్న కుటుంబం – చింతలేని కుటుంబం”, “హమ్ దో హమారే దో”, “చోటి పరివార్ సుఖీ పరివార్” వంటి నినాదాలతో ప్రజల్లో కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించింది.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భుజంగారావు మాట్లాడుతూ, పెరుగుతున్న జనాభా కారణంగా సహజ వనరులపై ఒత్తిడి పెరిగి, కుటుంబాలపై ఆర్థిక భారం అధికమవుతుందని తెలిపారు. వాతావరణ కాలుష్యం, పారిశుద్ధ్య సమస్యలు, జీవన ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రతి కుటుంబం కుటుంబ నియంత్రణలో శాశ్వత, తాత్కాలిక పద్ధతులను అవలంబించాలని సూచించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో మానవహారం నిర్వహించి కుటుంబ నియంత్రణపై ప్రతిజ్ఞ చేశారు.

తదనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమావేశ మందిరంలో నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ మాట్లాడుతూ, పిల్లల మధ్య సరైన అంతరం పాటించడం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా బలోపేతమవుతుందని తెలిపారు. అబ్బాయి, అమ్మాయి అనే తేడా లేకుండా ప్రతి కుటుంబం కుటుంబ నియంత్రణపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులైన పీపీఐయూసీడీ, ఐయూసీడీ, అంతర ఇంజెక్షన్, ఓరల్ పిల్స్ తదితరాలను అవసరానికి అనుగుణంగా వినియోగించాలని, శాశ్వత కుటుంబ నియంత్రణలో మహిళలతో పాటు పురుషులు కూడా బాధ్యత తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా కుటుంబ నియంత్రణ, కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలులో విశేష సేవలందించిన వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులను శాలువాలు, మెమెంటోలు, ప్రశంసాపత్రాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మీప్రసన్న, డాక్టర్ అరుణరేఖ, డీఐఓ డాక్టర్ అశోక్, జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్ రవీందర్, డాక్టర్ సికందర్, ఏవో సుమంత్ కుమార్, ఎస్‌వో రాజేశ్వర్, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ వెంకన్న, డాక్టర్ శిఖరం, డాక్టర్ నవ్య, డిప్యూటీ డెమో దుర్గారావు, డీహెచ్‌ఈలు గన్‌పూర్ వెంకటేశ్వర్లు, షేక్ సలీం, వైద్యాధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మీప్రసన్న, డాక్టర్ అరుణరేఖ, డీఐఓ డాక్టర్ అశోక్, జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్ రవీందర్, డాక్టర్ సికందర్, ఏవో సుమంత్ కుమార్, ఎస్‌వో రాజేశ్వర్, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ వెంకన్న, డాక్టర్ శిఖరం, డాక్టర్ నవ్య, డిప్యూటీ డెమో దుర్గారావు, డీహెచ్‌ఈలు గన్‌పూర్ వెంకటేశ్వర్లు, షేక్ సలీం, వైద్యాధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *