- అనుమతి లేకుండా స్కూళ్లు, కాలేజీల్లోకి విద్యార్థి సంఘాలు ప్రవేశించవద్దు
- చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు
- సమస్యలు ఉంటే జిల్లా, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచన
నిజామాబాద్, జూలై 2: నిజామాబాద్.
(E6 క్రైమ్ న్యూస్- శివ ఠాకూర్)
విద్యాసంస్థలపై దాడులు చేయడం, యాజమాన్యాన్ని బెదిరించడం, విద్యాసంస్థల బంద్‌లకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. హెచ్చరించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో కొన్ని విద్యార్థి సంఘాల పేరుతో వ్యక్తులు పాఠశాలలు, కళాశాలల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించి అలజడి సృష్టించడం, యాజమాన్యాలను బెదిరించడం, విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం వంటి ఘటనలపై విద్యాసంస్థల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు.
డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశపూర్, బర్దిపూర్ శివారులో ఉన్న నారాయణ విద్యాసంస్థలో అక్రమంగా ప్రవేశించి కుర్చీలు, ఫ్లెక్సీలు తదితర వస్తువులను ధ్వంసం చేసిన వారిపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అలాగే వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని చందూరు మండలంలోని శ్రీ సాయి విద్యాలయం స్కూల్‌లో యాజమాన్య అనుమతి లేకుండా ప్రవేశించి సిబ్బందిని బెదిరించడం, విద్యార్థులను భయాందోళనకు గురిచేయడం, పాఠశాల ఆస్తులను ధ్వంసం చేసిన వారిపైనా క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఈ రెండు కేసుల్లో నిందితులపై గతంలో నమోదైన కేసులు ఉన్నట్లయితే వాటిని పరిగణనలోకి తీసుకుని అదనపు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు.
విద్యాసంస్థలకు సంబంధించిన సమస్యలు ఉంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా సంబంధిత జిల్లా అధికారులు లేదా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అధికారులు నిబంధనల ప్రకారం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.
విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగించే విధంగా విద్యాసంస్థల్లో ఇబ్బందికర వాతావరణం సృష్టించడం, నిర్వాహకుల విధులకు ఆటంకం కలిగించడం, బలవంతంగా బంద్ చేయించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పాఠశాలలు, కళాశాలలను ఎవరూ బలవంతంగా బంద్ చేయించరాదని, అలాంటి చర్యలకు పాల్పడితే సంబంధిత వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య స్పష్టం చేశారు.

