Breaking News

వరద కాలువలో నీటిని నింపి రైతులకు సాగునీరు అందించాలి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి.

రివర్స్ పంపింగ్ ప్రతిపాదనలు వారంలో సిద్ధం చేయాలి – సబ్ కాంట్రాక్టర్ల సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం

వేల్పూర్, జూలై 2: E6 న్యూస్T, గంగాధర్

నియోజకవర్గ పరిధిలోని గాండ్లపేట్ వద్ద వరద కాలువ మరమ్మత్తు పనులు దాదాపు పూర్తయిన నేపథ్యంలో, మిగిలిన చిన్నచిన్న సమస్యలను వెంటనే పరిష్కరించి రివర్స్ పంపింగ్ ద్వారా కాలువను నింపి ఆయకట్టు గ్రామాల రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను కోరారు.

ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ ఈఈ లాల్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి, వరద కాలువ పనులు పూర్తయిన తర్వాత సబ్ కాంట్రాక్టర్ల మధ్య ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అవసరమైతే తాను కూడా ప్రధాన కాంట్రాక్టర్లతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

రైతుల ప్రయోజనాల దృష్ట్యా పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని, వచ్చే వారం రోజుల్లోనే రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువకు నీరు అందించే ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

వరద కాలువపై ఉన్న తూముల ద్వారా ఆయకట్టు గ్రామాల చెరువులు నింపి రైతులకు సాగునీరు అందించేందుకు ఇదే ప్రధాన ఆధారమని పేర్కొన్న ఆయన, అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు వెంటనే పంపించాలని ఈఈని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఈఈ లాల్ సింగ్ మాట్లాడుతూ ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 15.2 టీఎంసీల నీటి నిల్వ ఉందని, ఎగువన ఉన్న బాబ్లీ ప్రాజెక్టు నుంచి 14 గేట్లు ఎత్తి 5.2 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు.

దీనిపై స్పందించిన ప్రశాంత్ రెడ్డి, ఎస్సారెస్పీ నుంచి గానీ, అవసరమైతే రివర్స్ పంపింగ్ ద్వారా గానీ వరద కాలువను పూర్తిగా నింపి ఈ సాగు సీజన్‌లో రైతులకు నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *