Breaking News

కేటీఆర్‌కు జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్: “తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పిల్లల చావు కోరుకుంటావా.. ఇదేనా నీ సంస్కృతి?”

హైదరాబాద్:

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సరూర్ నగర్ సభలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. గాంధీ కుటుంబానికి, కేసీఆర్ కుటుంబానికి ఉన్న తేడాను వివరిస్తూ జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడిన ముఖ్యాంశాలు:

కృతజ్ఞత లేని రాజకీయం మీది!

“బుక్కెడు బువ్వ పెడితే పది కాలాల పాటు చల్లగా ఉండమని దీవించడమే తెలంగాణ సంస్కృతి. అలాంటిది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ కొడుకు, కూతురైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల చావును కోరుకుంటావా కేటీఆర్? ఇదేనా నీ సంస్కృతి? నీ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత అనేవి లేవు. ఆనాడు తెలంగాణ ఇస్తే సోనియా గాంధీకి తన చర్మం వొలిచి చెప్పులు కుట్టిస్తానని కేసీఆర్ అన్నారు. రాష్ట్రం వచ్చాక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు స్వయంగా వెళ్లి సోనియా గాంధీ కాళ్ళు మొక్కిన సంగతిని ఇప్పుడు మర్చిపోయారా? సోనియా గాంధీ దయతోనే తెలంగాణ వచ్చింది, పదేళ్ల పాటు మీరు రాజభోగాలు అనుభవించారు. ఇప్పుడేమో అదే కుటుంబం నాశనాన్ని కోరుకుంటూ డెత్ డిక్లరేషన్ అంటారా?” అని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిరుద్యోగులను మోసం చేసింది ఎవరు?

గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. “మీ ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పేపర్ లీక్ అయినప్పుడు, అశోక్ నగర్ వెళ్లి నిరుద్యోగులకు సమాధానం చెప్పే ధైర్యం చేశారా కేటీఆర్? కానీ నేడు రాహుల్ గాంధీ నాయకత్వంలో, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 562 గ్రూప్-1 ఉద్యోగాలతో పాటు వివిధ శాఖల్లో కలిపి మొత్తం 70 వేల ఉద్యోగాలను నిరుద్యోగులకు అందించాం. ఈ నిజాన్ని ఎందుకు దాస్తున్నావు?” అని ప్రశ్నించారు.

మాట నిలబెట్టుకునేది గాంధీ కుటుంబమే!

రాజకీయ విలువలకు సంబంధించి జగ్గారెడ్డి మాట్లాడుతూ.. “విలువలతో కూడిన రాజకీయం గాంధీ కుటుంబానిది అయితే, విలువలు లేని రాజకీయం కేసీఆర్ కుటుంబానిది. మాట ఇస్తే ప్రాణాలైనా అడ్డుపెట్టి నిలబెట్టుకునేది రాహుల్ గాంధీ కుటుంబం. కానీ, మాట ఇస్తే నమ్మించి మోసం చేయడం కేసీఆర్ కుటుంబానికి అలవాటు” అంటూ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *