అమరావతి:
విజయనగరం జిల్లాలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 1న జరగనున్న ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని అధికారికంగా ఆహ్వానించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.
ఢిల్లీ పర్యటన షెడ్యూల్
సీఎం చంద్రబాబు ఉదయం 7:30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి ఉదయం 10 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సీఆర్ పాటిల్‌లతో కూడా ఆయన భేటీ కానున్నారు. రాత్రి ఢిల్లీలోనే బస చేసి, గురువారం ఉదయం సచివాలయానికి చేరుకుంటారు.
ఉత్తరాంధ్ర రత్నంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్
అంతకుముందు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రధాని మోదీకి ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఘన స్వాగతం పలకాలని అధికారులను ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే అది “ఉత్తరాంధ్ర రత్నం”గా మారుతుందని, రాష్ట్ర ఆర్థిక రంగానికి పెద్ద ఊతం ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో భాగంగా ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్‌తో పాటు జీఎంఆర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్-యూనివర్సిటీ, జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యుకేషన్ సిటీలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
భూములిచ్చిన రైతులకు ఉచిత విమాన ప్రయాణం!
ఈ ప్రాజెక్ట్ కోసం భూములు త్యాగం చేసిన రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్ ప్రకటించారు. రైతులను గౌరవిస్తూ వారికి ఒకసారి ఉచిత విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే జూలై 22 నుంచి జూలై 31 వరకు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలని, అంతర్జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ ప్రశంసించిన ‘అరకు కాఫీ’ బ్రాండింగ్‌ను ఈ సందర్భంగా మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు.
ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం: ప్రధాని మోదీకి ఆహ్వానం పలికేందుకు ఢిల్లీకి సీఎం చంద్రబాబు!

