జులై 03: E6 న్యూస్ నిజామాబాద్ (శివ ఠాకూర్).
ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సోలమన్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం నిజామాబాద్ రీజియన్ పరిధిలోని నిజామాబాద్ బస్ స్టేషన్‌తో పాటు నిజామాబాద్–2 డిపోను సందర్శించిన ఆయన, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఆపరేషన్, ఛార్జింగ్ వ్యవస్థ, భద్రతా చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రీజియన్‌లో మొత్తం 89 ఎలక్ట్రిక్ బస్సులు ఉండగా, ప్రస్తుతం 35 బస్సులు మాత్రమే ఆపరేషన్‌లో ఉన్నట్లు అధికారులు వివరించారు.
ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సుల్లో సాంకేతిక లోపాలు, ఆకస్మికంగా మంటలు చెలరేగిన ఘటనల నేపథ్యంలో ప్రత్యేక అప్రమత్తత అవసరమని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఎలక్ట్రిక్ బస్సును పూర్తిస్థాయిలో సాంకేతికంగా తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణికుల సేవలకు వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా బ్యాటరీలు, వైరింగ్, ఛార్జింగ్ వ్యవస్థ, ఉష్ణోగ్రత నియంత్రణ తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
ప్రయాణికుల భద్రతే సంస్థకు అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేలా డ్రైవర్లు, సాంకేతిక సిబ్బందికి ప్రత్యేక శిక్షణ, అవగాహన కల్పించాలని సూచించారు.
అనంతరం నిజామాబాద్ బస్ స్టేషన్‌ను పరిశీలించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, బస్సుల రాకపోకలు, సమాచార బోర్డులు, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో నిజామాబాద్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ శ్రీమతి పి. జ్యోతి, నిజామాబాద్–1 డిపో మేనేజర్, నిజామాబాద్–2 డిపో మేనేజర్, డిపో అధికారులు, సాంకేతిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

