Breaking News

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి,లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి

నిజామాబాద్, జూలై 28: (E6 tv NEWS) రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి భారీ ఆందోళనలు చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి హెచ్చరించారు.ఇందూరు బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోరుతూ విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ, మిస్ కాల్ ఉద్యమాన్ని మంగళవారం ప్రారంభించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు చదువును కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు అప్పులు చేసి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.విద్య హక్కును పరిరక్షించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్న ఆయన, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేవైఎం నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. సంతకాల సేకరణ, మిస్ కాల్ ఉద్యమం ద్వారా విద్యార్థుల గళాన్ని ప్రభుత్వానికి వినిపిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను విడుదల చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర కో-కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణ, బీజేపీ జిల్లా నాయకులు విపుల్ రావు, రాకేష్, రాజ్ గణేష్, బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఓం సింగ్, బీజేవైఎం నాయకులు సాయి ప్రవీణ్‌తో పాటు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *