చేయని నేరానికి జరిమానా విధించారని యువకుడి ఆరోపణ
రైలు పట్టాలపై విషం తాగి ఆత్మహత్యాయత్నం.. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
బోధన్, జూలై 17: E6 న్యూస్, అశోక్ కాంబ్లే.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం రాంపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ విధించిన జరిమానా, వేధింపుల కారణంగానే ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వెలువడ్డాయి.
స్థానికుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన ఇద్దరు యువకులపై గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తాము చేయని నేరానికి బాధ్యులుగా పేర్కొంటూ ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున మొత్తం రూ.60 వేల జరిమానా విధించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఎడపల్లి సమీపంలోని రైల్వే పట్టాల వద్ద విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతడిని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఈ ఘటనపై గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు భిన్నంగా స్పందించారు. ఓ వ్యవసాయ పొలంలో జరిగిన దొంగతనం ఘటనలో సంబంధిత యువకులు ప్రమేయం ఉన్నట్లు భావించి, గ్రామంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. ఆ మొత్తాన్ని గ్రామంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కోసం వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.అదే ఘటనలో మరో యువకుడి నుంచి తొలుత రూ.10 వేల జరిమానా తీసుకున్నప్పటికీ, అనంతరం అతనికి ఆ డబ్బును తిరిగి ఇచ్చిన విషయంపై ప్రశ్నించగా, ఆ వ్యక్తికి ఘటనతో సంబంధం లేదని తేలడంతో డబ్బు తిరిగి ఇచ్చినట్లు కమిటీ సభ్యులు వివరణ ఇచ్చినట్లు సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు లేదా సంబంధిత అధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. యువకుడి ఆరోపణలు, గ్రామ అభివృద్ధి కమిటీ వివరణ నేపథ్యంలో పూర్తి వివరాలు అధికారిక విచారణ అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

