ప్రైవేట్ స్కూళ్ల నుంచి 5,111 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరిక.
రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా ప్రథమ స్థానం – ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను అభినందించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి.
నిజామాబాద్, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్).
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక వసతులు, డిజిటల్ బోధన, ఆంగ్ల మాధ్యమం, విద్యార్థి కేంద్రిత విద్యా విధానాలపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలల నుంచి 5,111 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం జిల్లాకు విశిష్ట గుర్తింపును తీసుకొచ్చిందన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, సిబ్బందిని ఎమ్మెల్యే హృదయపూర్వకంగా అభినందించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తల్లిదండ్రుల నమ్మకం రోజురోజుకూ పెరుగుతుండటం సంతోషకర పరిణామమని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధనతో పాటు డిజిటల్ తరగతి గదులు, ఆధునిక ప్రయోగశాలలు, మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం కల్పించడం వల్లే ఈ మార్పు సాధ్యమైందని ఎమ్మెల్యే వివరించారు.
విద్య బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు.
పిజిఐలో తెలంగాణకు మెరుగైన స్థానం
ఇటీవల కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన 2025–26 పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI) నివేదికలో తెలంగాణ 599.70 స్కోర్‌తో దేశంలో 18వ స్థానం సాధించి ‘ప్రచేష్ట-3’ గ్రేడ్‌లో నిలవడం ప్రభుత్వ విద్యలో సాధిస్తున్న పురోగతికి నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
సమిష్టి కృషికే ఫలితం
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించడం ద్వారా నాణ్యమైన విద్యతో పాటు సమాన అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం జిల్లా విద్యాశాఖ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల సమిష్టి కృషికి నిదర్శనమని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి కొనియాడారు.

