భక్తులకు సురక్షిత, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యం: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య
పుష్కర ఘాట్ల వద్ద భద్రత, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష
సీసీ కెమెరాలు, డ్రోన్లతో 24 గంటల నిఘా ఏర్పాటు
వృద్ధులు, మహిళలు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు
అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశం
నిజామాబాద్, జూలై 22: (E6 tv NEWS ప్రతినిధి): గోదావరి పుష్కరాలు–2027ను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకుసాగాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ ఏర్పాట్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, అత్యవసర సేవలు, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై బుధవారం పోలీస్ కమిషనరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలు రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక ఆధ్యాత్మిక మహోత్సవమని, లక్షలాది మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చే అవకాశమున్నందున ప్రతి అంశాన్ని ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి ఘాట్‌కు ప్రత్యేక బందోబస్తు ప్రణాళిక రూపొందించి, రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన సంఖ్యలో పోలీసు అధికారులు, సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.
పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, క్యూ లైన్లు, బ్యారికేడ్లు, హెచ్చరిక బోర్డులు, దిశానిర్దేశక సూచికలు ఏర్పాటు చేయాలని సూచించారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.
వాహనాల రద్దీని నివారించేందుకు ఘాట్లకు దూరంగా పార్కింగ్ స్థలాలను గుర్తించి, అక్కడి నుంచి షటిల్ వాహనాల ద్వారా భక్తులను తరలించే విధంగా కార్యాచరణ చేపట్టాలని, ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిబ్బందిని మోహరించాలని ఆదేశించారు.పుష్కర ఘాట్లు, పార్కింగ్ ప్రదేశాలు, ప్రధాన కూడళ్లు, రహదారులు తదితర కీలక ప్రాంతాల్లో ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలని, అవసరమైన చోట డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేపట్టి జనసమ్మర్థాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సూచించారు.
భక్తులకు సమాచారాన్ని చేరవేసేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు, హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని, తప్పిపోయిన చిన్నారులు, వృద్ధుల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. వైద్య, అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, ఆర్టీసీ, నీటిపారుదల, విపత్తు నిర్వహణ శాఖలతో సమన్వయం పెంచి సంయుక్త కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
పుష్కర ఘాట్ల వద్ద తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు, లైటింగ్, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, పుకార్లు, తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు సోషల్ మీడియా పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ప్రకాష్ యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్లు, గోదావరి పరివాహక ప్రాంత సీఐలు, ఎస్‌ఐలు, ఐటీ కోర్, కమ్యూనికేషన్ విభాగం సిబ్బంది, పోలీస్ కార్యాలయ సూపరింటెండెంట్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

