Breaking News

18 ఏళ్లుగా ఇందూరు జిల్లాను ఎడారిగా మార్చింది కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలే: దినేష్ పటేల్ కులాచారి

సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విమర్శ – రైతులను మోసం చేస్తే బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఉద్యమాలకు హెచ్చరిక

నిజామాబాద్, జూలై 18: E6 tv NEWS (శివ ఠాకూర్).

గత 18 ఏళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఇందూరు జిల్లా ఎడారిగా మారుతోందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆరోపించారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శ్రీరాంసాగర్ (ఎస్‌ఆర్‌ఎస్‌పీ), నిజాంసాగర్ వంటి ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను వరుస ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు.ప్రాజెక్టు-20, 21, 22ల పరిధిలో గత 30 నెలలుగా కనీస నిర్వహణ పనులు కూడా చేపట్టలేదని, మట్టిని తొలగించడం గానీ, పైపులైన్ల మరమ్మతులు గానీ చేయలేదన్నారు. దీంతో సాగునీటి వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపించారు.

ప్యాకేజీ-21లో భాగంగా బినోల్ నుంచి సారంగాపూర్ వరకు రూ.900 కోట్లతో నిర్మించిన అండర్‌గ్రౌండ్ పంపింగ్ వ్యవస్థ ప్రస్తుతం నిరుపయోగంగా మారిందన్నారు. ట్రయల్ రన్ నిర్వహించినప్పటికీ సరైన నిర్వహణ లేక పంపులు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. అలాగే సారంగాపూర్ నుంచి కొండెం చెరువు వరకు రూ.1,200 కోట్లతో చేపట్టిన పనులు కూడా రైతులకు ప్రయోజనం చేకూర్చలేదన్నారు.

సారంగాపూర్ నుంచి గుత్ప, అలీసాగర్ ప్రాంతాల్లోని 47 వేల ఎకరాలకు నీరు అందించాలంటే ప్రస్తుత కాలువ సామర్థ్యం సరిపోవడం లేదని, కాలువలను విస్తరించకపోతే లక్ష ఎకరాలకు సాగునీరు అందించడం అసాధ్యమని తెలిపారు. నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క ఎకరానికీ నీరు ఇవ్వలేదని ఆరోపించారు.

రూ.18 వేల కోట్లతో నిర్మించిన పైపులైన్లు, పంప్‌హౌస్‌లు ప్రజలకు ఉపయోగపడకుండా నేలపాలయ్యాయని, కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టులను ఉపయోగించుకున్నారని విమర్శించారు. గతంలో కమిషన్ల రాజకీయాలతో ప్రాజెక్టులు నష్టపోయాయని, ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని ఆరోపించారు.

బైరాపూర్ పంప్‌హౌస్ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు డా. భూపతి రెడ్డి, పి. సుదర్శన్ రెడ్డిని డిమాండ్ చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేకు ప్రాజెక్టులపై కనీస అవగాహన కూడా లేదని ఆయన విమర్శించారు.

సాగునీటి కొరతతో గత 18 ఏళ్లుగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఉపాధి కోసం దాదాపు రెండు లక్షల మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని దినేష్ పటేల్ కులాచారి ఆవేదన వ్యక్తం చేశారు. పాత డిజైన్ల పేరుతో మరోసారి రైతులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తే, రైతులు, ప్రజలను ఏకం చేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా భారీ ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ సమావేశంలో గద్దె భూమన్న, నక్క రాజేశ్వర్, ఓం సింగ్, అనంత్ రెడ్డి, కర్క గంగారెడ్డి, చింత శ్రీనివాస్ రెడ్డి, నరేష్, శంకర్ రెడ్డి, శశాంక్, జగన్ రెడ్డి, ఆనంద్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *