ప్రతిపక్షాల ఆరోపణలు ఆధారరహితం – కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విమర్శ
నిజామాబాద్, జూలై 21 (E6 tv NEWS ప్రతినిధి)
బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం “దొంగనే దొంగా దొంగా అన్నట్లు” ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి. సుదర్శన్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలు, సాగునీటి అంశాలు, ప్రతిపక్షాల విమర్శలపై స్పందిస్తూ పలు ఆరోపణలకు సమాధానం ఇచ్చారు.
గతంలో సాగునీటి, ఐటీ వంటి కీలక శాఖలను నిర్వహించిన నాయకులే ఇప్పుడు వాస్తవాలను పక్కనబెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ఆక్షేపించారు. ఆధారాలు లేని ఆరోపణలతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.బీజేపీ రాజకీయాలపై కూడా ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “ఓటు చోరీ, సీటు చోరీ… బీజేపీ రాజకీయాలన్నీ ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేసే విధంగానే ఉన్నాయి” అని అన్నారు. వ్యక్తిగత దూషణలు చేయడం కాంగ్రెస్ సంస్కృతి కాదని, “తిట్టడం మాకూ వచ్చు… కానీ కాంగ్రెస్ పార్టీ అలాంటి రాజకీయాలను నేర్పలేదు” అని స్పష్టం చేశారు.
కమీషన్ల రాజకీయాల వల్లే నేటి సమస్యలు
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణమని ఎమ్మెల్యే ఆరోపించారు. కమీషన్ల కోసం ప్రాజెక్టుల రూపకల్పన, అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించడంతోనే కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. వ్యక్తిగత, కుటుంబ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టుల అంశాన్ని వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
డ్యామ్ భద్రతపై రాజకీయం తగదు
డ్యామ్ భద్రత అత్యంత కీలకమైన అంశమని, డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలను విస్మరించి నీటి విడుదలపై ఒత్తిడి తేవడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిపుణుల సూచనలను పక్కనబెట్టి రాజకీయ లబ్ధి కోసం మాట్లాడటం బాధ్యతారాహిత్యమని అన్నారు.
ప్రజలు నిజాలను గమనిస్తున్నారు
“జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా… లేక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే మాట్లాడుతున్నారా?” అని ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి, ప్రజల సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పాలన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అసత్య ప్రచారాలు, రాజకీయ విమర్శలతో ప్రభుత్వ పనితీరును దెబ్బతీయాలనే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

