ఇస్కాన్ కార్యక్రమాలతో హిందువుల్లో ఐక్యత పెరుగుతోంది: ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్‌లో జగన్నాథుని రథయాత్రకు ఘన ప్రారంభం – జిల్లా కేంద్రంలో ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి కృషి చేయాలని సూచన
నిజామాబాద్, జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్.
ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు హిందూ సమాజంలో ఐక్యతను పెంపొందిస్తున్నాయని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ ఇస్కాన్ ఆధ్వర్యంలో నగరంలోని గంజి కమాన్ వద్ద నిర్వహించిన జగన్నాథుని రథయాత్రను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత తొమ్మిది సంవత్సరాలుగా నిజామాబాద్ నగరంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు. వారం రోజులపాటు జగన్నాథుడు, సుభద్రాదేవి, బలరాముడి విగ్రహాలను మండపంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించడం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోందన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ సేవలు విస్తరిస్తున్నాయని పేర్కొన్న ఆయన, ఇటీవల బోధన్‌లో ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి స్థల సేకరణ పూర్తయిందని గుర్తు చేశారు. అదే తరహాలో జిల్లా కేంద్రంలో కూడా విశాలమైన ఇస్కాన్ ఆలయం నిర్మించేలా కృషి చేయాలని సూచించారు. హనుమాన్ జయంతి, గణేష్ నిమజ్జనాల తర్వాత ఇస్కాన్ రథయాత్రకు ప్రజల ఆదరణ మరింత పెరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ కూరగాయల ఉమారాణి, నిజామాబాద్ ఇస్కాన్ అధ్యక్షుడు సిద్ధ బలరామయ్య, కార్పొరేటర్లు బంటు ప్రీతి ప్రవీణ్, నాగోళ్ల లక్ష్మీనారాయణ, బెల్లాల్ శశాంక్, పసునూరి రాము, ప్రసూన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

