Breaking News

ఆధునిక నిర్మాణ సాంకేతికతతో నాణ్యమైన భవనాల నిర్మాణం

షేర్ వాల్ టెక్నాలజీతో మోపాల్ పోలీస్ స్టేషన్ నిర్మాణం పరిశీలించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలోనూ ఈ సాంకేతికత అమలుకు కృషి చేస్తామని వెల్లడి

నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్

ఆధునిక నిర్మాణ రంగంలో వేగం, నాణ్యత, భద్రతకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో షేర్ వాల్ (Shear Wall) టెక్నాలజీ వినియోగాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు.గురువారం మోపాల్ మండల కేంద్రంలో షేర్ వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను స్థానిక సీఐ సురేష్, ఎస్‌ఐ సుస్మిత, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు, ఇంజినీర్లను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సంప్రదాయ ఇటుక నిర్మాణాలకు బదులుగా రీన్‌ఫోర్స్‌డ్ సిమెంట్ కాంక్రీట్ (RCC), స్టీల్ ఆధారంగా నిర్మించే షేర్ వాల్ టెక్నాలజీ భవనాలకు అధిక బలం, మన్నికను అందిస్తుందని తెలిపారు. ఈ సాంకేతికతతో నిర్మించిన భవనాలు భూకంపాలు, బలమైన గాలులు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని పేర్కొన్నారు.

షేర్ వాల్ టెక్నాలజీతో నిర్మాణ పనులు వేగంగా పూర్తికావడంతో పాటు నాణ్యత ప్రమాణాలు కూడా మెరుగ్గా ఉంటాయని, ప్రభుత్వ భవనాల నిర్మాణంలో ఈ విధానం మంచి ఫలితాలను ఇస్తోందని చెప్పారు. ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడే శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనలో ఆధునిక నిర్మాణ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.పేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లలో కూడా షేర్ వాల్ టెక్నాలజీని అమలు చేసే అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. దీంతో లబ్ధిదారులకు తక్కువ సమయంలో నాణ్యమైన, సురక్షితమైన, మన్నికైన ఇళ్లను అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, నాణ్యత, పారదర్శకత, వేగవంతమైన నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, మాజీ ఐసీడీఎంఎస్ చైర్మన్ సాయరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *