జాతీయ, అంతర్జాతీయ విజయాలతో నిజామాబాద్ జిల్లాకే గర్వకారణంగా నిలిచిన యువ క్రీడాకారుడు
క్రమశిక్షణ, కఠోర సాధనే విజయానికి మూలం – సీపీ సాయి చైతన్య
నిజామాబాద్, జూలై 13: E6 న్యూస్ శివ ఠాకూర్
జాతీయ, అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో వరుస విజయాలు సాధిస్తూ నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు తీసుకొస్తున్న యువ క్రీడాకారుడు డిల్లోడ్ గన్‌రాజ్‌ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐపీఎస్ సోమవారం తన కార్యాలయంలో ఘనంగా సన్మానించి అభినందించారు.
ఇటీవల ముంబైలో నిర్వహించిన WRPF ఇండియా ఓపెన్ వెస్ట్ జోన్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్–2026లో 56 కిలోల టీన్ విభాగంలో ప్రథమ స్థానం సాధించిన గన్‌రాజ్ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలోనూ పలు పతకాలు గెలుచుకుని ప్రతిభ చాటుకున్నాడు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ, యువత క్రీడల్లో రాణించడం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర సాధనతో గన్‌రాజ్ సాధిస్తున్న విజయాలు ప్రశంసనీయమని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేత, తెలంగాణ BC–SC–ST మైనార్టీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, BC సాధికారత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సాపూర్ శంకర్ మాట్లాడుతూ, చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు, సమాజం అన్ని విధాలా ప్రోత్సాహం అందించాలని కోరారు. గన్‌రాజ్ భవిష్యత్తులో ప్రపంచ ఛాంపియన్‌గా ఎదిగి భారత జెండాను అంతర్జాతీయ వేదికలపై మరింత ఎత్తులో ఎగురవేయాలని ఆకాంక్షించారు.సన్మాన కార్యక్రమంలో గన్‌రాజ్ తండ్రి డిల్లోడ్ శేఖర్ పాల్గొని, తన కుమారుడిని సన్మానించిన పోలీస్ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవం గన్‌రాజ్‌కు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.

