Breaking News

జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ XII ప్రారంభం

  • తప్పిపోయిన, నిరాశ్రయ, బాల కార్మిక చిన్నారుల గుర్తింపు, రక్షణే లక్ష్యం
  • జూలై 1 నుంచి 31 వరకు ప్రత్యేక తనిఖీలు
  • ప్రజల సహకారంతో ప్రతి చిన్నారిని కుటుంబానికి చేర్చడమే ధ్యేయం

నిజామాబాద్, జూలై 2:(E6 క్రైమ్-శివ ఠాకూర్)

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్‌లో ఆపరేషన్ ముస్కాన్–XII కార్యక్రమాన్ని అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీ ఎన్. శుభం ప్రకాష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 1 నుంచి జూలై 31 వరకు నెల రోజులపాటు నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా తప్పిపోయిన చిన్నారులు, నిరాశ్రయ బాలలు, వీధి బాలలు, బాల కార్మికులను గుర్తించి రక్షించి, చట్టపరమైన సంరక్షణతో వారి కుటుంబాలకు పునఃకలయిక కల్పించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా–శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, విద్యాశాఖ, జిల్లా బాలల పరిరక్షణ యూనిట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, మార్కెట్లు, హోటళ్లు, ఢాబాలు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, గ్యారేజీలు, వర్క్‌షాపులు, నిర్మాణ ప్రాంతాలు, ధార్మిక, పర్యాటక ప్రాంతాలతో పాటు ఇతర ప్రజా ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ప్రమాదంలో ఉన్న చిన్నారులను గుర్తించి సురక్షితంగా పునరావాసం కల్పించనున్నట్లు తెలిపారు.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్న అదనపు డీసీపీ, చిన్నారులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అలాంటి ఘటనలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ పాండేరావు, ఏహెచ్‌టీయూ ఇన్‌స్పెక్టర్ ఏ. సురేష్, జిల్లా వెల్ఫేర్ అధికారి డి. సౌందర్య, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ చైతన్య, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సీహెచ్. ప్రభుదాస్, ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ కల్పన, డీఎంహెచ్‌వో కార్యాలయం ప్రతినిధి వెంకటేష్, జిల్లా కలెక్టరేట్, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *