Breaking News

లోకేశ్వరం మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

భవిత భవనం, కేజీబీవీ మౌలిక సదుపాయాలు, పాఠశాల ప్రహరీ గోడ ప్రారంభం – దివ్యాంగులకు పరికరాల పంపిణీ

లోకేశ్వరం, జూలై 16: E6 న్యూస్, తిరుపతి గౌడ్.

లోకేశ్వరం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శ్రీకారం చుట్టారు. గురువారం నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన భవిత భవనంను ప్రారంభించి, దివ్యాంగులకు ఎలక్ట్రికల్ సామగ్రి, ఇతర సహాయక పరికరాలను పంపిణీ చేశారు.

అనంతరం కేజీబీవీ పాఠశాలలో నాబార్డ్ నిధులతో రూ.45.12 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అదనపు మౌలిక సదుపాయాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు.

తదుపరి గోడిసెర గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, లోకేశ్వరం మండల ప్రజల చిరకాల డిమాండ్ అయిన అర్లీ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. రోడ్డు, వంతెన నిర్మాణానికి కలిపి సుమారు రూ.100 కోట్ల నిధులు మంజూరై, టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు వేగంగా ప్రారంభిస్తామని వెల్లడించారు.

అలాగే పిప్రీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పురోగతిపై వివరాలు వెల్లడిస్తూ, రైతులకు సాగునీటి సమస్యలు లేకుండా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామాల్లో అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఎలాంటి పక్షపాతం లేకుండా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

దివ్యాంగుల సంక్షేమం, విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి, రవాణా, సాగునీటి ప్రాజెక్టులు, గృహ నిర్మాణ పథకాల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, మండల నాయకులు, గ్రామస్తులు, విద్యార్థులు, దివ్యాంగులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *