Breaking News

ఎల్ నినో ప్రభావం ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలే పరిష్కారం

రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలి – ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమీక్షలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనడం

నిజామాబాద్, జూలై 20: E6 tv NEWS.
సూపర్ ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు సంప్రదాయ పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం శ్రేయస్కరమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి సూచించారు. గ్రామీణ స్థాయిలో రైతులకు విస్తృత అవగాహన కల్పించి, పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడిని ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.

సోమవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేశ్ రెడ్డి, తోట లక్ష్మీకాంత్ రావు, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారి, మేయర్ కే. ఉమారాణి, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశిష్ సంగ్వాన్, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు వివిధ శాఖల అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు.సమావేశంలో శ్రీరాంసాగర్, నిజాంసాగర్, అలీసాగర్, పోచారం తదితర జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి సరఫరా, విద్యుత్ డిమాండ్–సరఫరా, ప్రత్యామ్నాయ పంటల సాగుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా సమీక్షించారు. తక్కువ నీటితో సాగయ్యే ఆయిల్ పామ్, కందులు, నువ్వులు, వేరుశనగ, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ,

అందుబాటులో ఉన్న నీటి వనరులను సంరక్షిస్తూ తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రైతులను ఆరుతడి పంటల సాగు వైపు మళ్లించడంతో పాటు తీగజాతి కూరగాయలు, పాడి పరిశ్రమకు ప్రభుత్వ రాయితీలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోతులు, అడవి పందుల బెడద నుంచి పంటలను రక్షించేందుకు సోలార్ ఫెన్సింగ్‌కు సబ్సిడీ కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.

ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ

ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 45 శాతం వర్షపాతం లోటు నమోదైందని, రైతులు పంటల వైవిధ్యాన్ని పాటిస్తూ వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి, ఉద్యాన పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా మాట్లాడుతూ, మిగిలిన సాగు విస్తీర్ణంలో ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. భూగర్భ జలాల పెంపునకు సోక్ పిట్స్, వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు.

నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ..

రైతు వేదికల ద్వారా పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలిక ఆదాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, తోట లక్ష్మీకాంత్ రావు, పైడి రాకేశ్ రెడ్డి తమ నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులను వివరించి, ఫసల్ బీమా అమలు, సబ్సిడీపై విత్తనాలు, డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాలు, తాగునీటి సమస్య నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో “తెలంగాణ జలసిరి” గోడపత్రికను కూడా ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *