పండుగల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి
పాత నేరస్తులు, రౌడీషీటర్లపై నిఘా మరింత పటిష్టం
అక్రమ కార్యకలాపాలపై నిరంతర దాడులు.. అవసరమైతే పీడీ యాక్ట్
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి
పోలీస్ అధికారులకు సీపీ పి. సాయి చైతన్య ఆదేశాలు
నిజామాబాద్ జులై 10 : E6 క్రైమ్ న్యూస్, శివ ఠాకూర్
నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య స్పష్టం చేశారు. రాబోయే పండుగల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర దాడులు నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అవసరమైతే అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని సూచించారు.
శుక్రవారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఆర్మూర్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పురోగతిపై పోలీస్ కమిషనర్ సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. డివిజన్ పరిధిలో నమోదైన వివిధ రకాల కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణకు చేపడుతున్న చర్యలపై అధికారులతో చర్చించారు.
పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రాబోయే పండుగల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించాలని సీపీ సూచించారు. చెక్‌పోస్టుల వద్ద 24 గంటలూ తనిఖీలు కొనసాగించాలని, వాహన తనిఖీల్లో సిబ్బంది ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాలి
హత్యలు, హత్యాయత్నాలు, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, పేకాట, గుట్కా అక్రమ వ్యాపారం తదితర కేసులపై సీపీ ప్రత్యేకంగా సమీక్షించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
పాత నేరస్తుల కదలికలపై నిఘా
రౌడీషీటర్లు, పాత నేరస్తులు, బెయిల్‌పై విడుదలైన వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పహారా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. ఆర్మూర్ సబ్ డివిజన్ నిర్మల్, జగిత్యాల జిల్లాల సరిహద్దుల వరకు విస్తరించి ఉన్న నేపథ్యంలో ఇతర జిల్లాల నుంచి వచ్చి వెళ్లే వారిపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పొరుగు జిల్లాల పోలీస్ అధికారులతో సమన్వయం పెంచుకోవాలని ఆదేశించారు.
మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం
మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీపీ పేర్కొన్నారు. షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ వంటి ప్రత్యేక బృందాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు.
సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన
పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కమిషనర్ సూచించారు. ఆన్లైన్ మోసాలకు గురైన బాధితుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి సహాయం అందించాలని తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అక్రమ దందాలపై నిరంతర దాడులు
డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక దాడులు కొనసాగించాలని సీపీ స్పష్టం చేశారు. అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని సూచించారు. పేకాట, గుట్కా, ఇసుక అక్రమ రవాణాతో పాటు ఇతర చట్ట వ్యతిరేక వ్యాపారాలపై నిరంతర దాడులు నిర్వహించాలని ఆదేశించారు.
ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. అధికంగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్లను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. హైవేలను కలిపే లింకు రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
రోడ్డు ఇంజనీరింగ్ లోపాలను గుర్తించి నేషనల్ హైవే, స్టేట్ హైవే అథారిటీతో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని తెలిపారు. ప్రజల్లో రోడ్డు భద్రతా నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి
పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సీపీ సూచించారు. రిసెప్షన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ, స్టేషన్ పరిశుభ్రత, సిబ్బంది క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. సీసీ కెమెరాల వినియోగాన్ని విస్తరించి నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఆర్. అంజయ్య, ఆర్మూర్ ఎస్హెచ్ఓ పి. సత్యనారాయణ గౌడ్, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, భీంగల్ సీఐ సత్యనారాయణ గౌడ్, కమ్మర్పల్లి ఎస్సై సతీష్, ఏర్గట్ల ఎస్సై రాజేశ్వర్, మోర్తాడ్ ఎస్సై పి. రాము, భీంగల్ ఎస్సై తిరుపతి, మెండోరా ఎస్సై సుహాసిని, ముప్కల్ ఎస్సై కిరణ్ పాల్, బాల్కొండ ఎస్సై శైలేందర్, వేల్పూర్ ఎస్సై బి. సంజీవ్, నందిపేట ఎస్సై వినయ్, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

