ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతుగా బయలుదేరిన సందర్భంగా పోలీసుల అడ్డుకట్ట – కాంగ్రెస్ ప్రభుత్వంపై ధన్పాల్ తీవ్ర విమర్శలు
నిజామాబాద్, జూలై 20:E6 tv NEWS శివ ఠాకూర్
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు అంకాపూర్‌కు బయలుదేరిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాను సోమవారం పోలీసులు ఆయన నివాసం వద్దే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అనవసర వ్యాఖ్యలతో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.గత రెండున్నర సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించిన నిధులు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై తాము ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించే ధైర్యం కాంగ్రెస్ నాయకత్వానికి ఉందా అని ప్రశ్నించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని, మరోవైపు ఉద్యోగాల భర్తీ చేపట్టకుండా నిరుద్యోగ యువతను ప్రభుత్వం నిరాశకు గురిచేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని పేర్కొన్నారు.ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులను, రాజకీయ నాయకులను అడ్డుకోవడం, హౌస్ అరెస్టులకు పాల్పడడం అప్రజాస్వామిక చర్య అని ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయకుండా బీజేపీ కార్యక్రమాలను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగాన్ని వినియోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతుగా వెళ్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకోవడం, అరెస్టులు చేయడం ప్రభుత్వ అసహన వైఖరికి నిదర్శనమని ఆయన అన్నారు. ప్రజలు ప్రభుత్వ తీరును గమనిస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు.

