


ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై బీజేపీ–కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
అంకాపూర్ లో ఉద్రిక్త వాతావరణం, అప్రమత్తమైన పోలీసులు
ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యలతో రాజకీయ దుమారం.
ఆర్మూర్, జూలై 20: E6 tv NEWS, (శివ ఠాకూర్).
నిజామాబాద్ నగరంలో బీజేపీ నిర్వహించిన ఫీజు రీయింబర్స్మెంట్ రణభేరి కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే నివాసాన్ని చుట్టుముడతామని సవాల్ విసరగా, దానికి ప్రతిస్పందించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తన స్థాయికి తగిన నాయకులతోనే చర్చలకు సిద్ధమని వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం అంకాపూర్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేపట్టిన ఉద్యమాన్ని రాజకీయ రంగు పులిమి ఆర్మూర్ ప్రాంతాన్ని కావాలనే రణరంగంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
తాను చేసిన వ్యాఖ్యలను పూర్తిగా అర్థం చేసుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని అన్నారు. ఈ అంశంపై జిల్లా కాంగ్రెస్ నాయకులు, పార్టీ ఇన్చార్జీలు, ఆర్థిక నిపుణుల సమక్షంలో బహిరంగ చర్చకు తమ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు, సవాళ్లకే పరిమితమవుతున్నారని ఆయన ఆరోపించారు.
మరోవైపు, ఎమ్మెల్యే వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ తమ నిరసనను కొనసాగిస్తామని ప్రకటించారు. దీంతో ఆర్మూర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కి, జిల్లాలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.

